Studio18 News - జాతీయం / : భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలు ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, వారి రాజీనామాలను భారత రైల్వేశాఖ సోమవారం ఆమోదించింది. వినేశ్, పూనియా రాజీనామాలను ఆమోదించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అలాగే రిజైన్‌కు ముందు ఇవ్వాల్సిన 3 నెలల నోటీస్ పీరియడ్‌ను ఎత్తివేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో సర్వీస్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు ఉత్తర రైల్వేశాఖ తెలిపింది. అలా నోటీసు ఇచ్చిన తర్వాతే ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా సమర్పించారు. కాగా, నార్తర్న్ రైల్వేస్‌లో వినేశ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) గా విధులు నిర్వహించారు. అలాగే భజరంగ్ పూనియా కూడా ఓఎస్‌డీగానే పనిచేశారు. ఇక తాజాగా హస్తం పార్టీ గూటికి చేరిన ఈ ఇద్దరు రెజ్లర్లు త్వరలో హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నారు. ఇప్పటికే వినేశ్ ఫోగట్‌కు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీటు కూడా ఖాయమైన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. గత నెలలో ముగిసిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో 50 కిలోల ఫ్రీస్టైల్ కేటగిరీలో వినేశ్ ఫోగట్‌పై ఫైనల్‌కు కొన్ని గంటల ముందు అనర్హత వేటు పడింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా చివరి నిమిషంలో అనర్హతకు గురయ్యారు. దాంతో త్రుటిలో పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయారు.
Admin
Studio18 News