Studio18 News - అంతర్జాతీయం / : Russia-Ukraine War : రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య గత రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దళాలు వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నాయి. ప్రతిగా ఉక్రెయిన్ సైతం బాంబుల దాడులతో రష్యాను సవాల్ చేస్తుంది. సుదీర్ఘంగా సాగుతున్న ఇరుదేశాల మధ్య వైర్యాన్ని శాంతి చర్చలతో ముగించేది ఎవరనే అంశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పలు దేశాలు రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొల్పేలా ముందడుగు వేసేంది భారత ప్రధాని నరేంద్ర మోదీనేనని చెబుతున్నాయి. ఇప్పటికే ఇటీవలికాలంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో మోదీ పర్యటనసైతం కొనసాగింది. గత నెలలో ఉక్రెయిన్ లో మోదీ పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడుతూ.. చర్చలు, దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎవరి పక్షాన లేదని, కేవలం శాంతి పక్షమే భారత్ నిలుస్తుందని ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధంలో చైనా, భారత్, బ్రెజిల్ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంలో చైనా, భారత్ కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భారత్ ఓ అడుగు ముందుకేసింది. దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రంగంలోకి దిగనున్నారు. అజిత్ డోభాల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొననున్నారు. అదే సమయంలో రష్యా, చైనా కీలక అధికారులతో ఆయన భేటీ అవుతారు. అయితే, గత నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై టెలీఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. బ్రిక్స్ ఎన్ఎస్ఏల సదస్సు సమయంలో ఉక్రెయిన్ శాంతికోసం ఆలోచనలను డోభాల్ పంచుకుంటారని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడికి చెప్పినట్లు సమాచారం.
Admin
Studio18 News