Studio18 News - జాతీయం / : గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయనున్నట్టు సీబీఐ తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల పరిశీలన కోసం నిందితుడి డీఎన్ఏతో కూడిన మెడికల్ రిపోర్టులను పంపించినట్టు వెల్లడించింది. అక్కడి వైద్యుల తుది అభిప్రాయం అందిన తర్వాత ఈ కేసు దర్యాప్తును ముగించాలని సీబీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో సహా 100కి పైగా మంది వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 10 మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇవన్నీ చేసిన అనంతరమే ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదని నిర్ణయానికి వచ్చినట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి. త్వరగా రిపోర్ట్ ఇవ్వాలంటున్న సీఎం మమత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ విపక్షాలు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో అప్‌డేట్ వెల్లడించాలంటూ సీబీఐపై మమతా బెనర్జీ ఒత్తిడి తెస్తున్నారు. ‘‘ఐదు రోజుల సమయం అడిగాను(రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు కోసం). కానీ కేసును సీబీఐకి బదిలీ చేశారు. వారికి న్యాయం అక్కర్లేదు. ఆలస్యం అయితే చాలు. ఇప్పటికి 16 రోజులైంది. న్యాయం ఎక్కడ?’’ అని ఇటీవల ఆమె కోల్‌కతాలో మాట్లాడుతూ అన్నారు. పశ్చిమ బెంగాల్ మంత్రి బ్రత్యా బసు కూడా సీబీఐ రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News