Studio18 News - జాతీయం / : అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ముందుసీట్లో ఆ రోగి భార్యను వేధించారు. భర్త ఆరోగ్యంపై ఆందోళనతో ఉందనే జాలి కూడా లేకుండా మానవత్వం మరిచి ఈ దుర్మార్గానికి తలపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి వేధింపులను అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆక్సిజన్ అందక ఆ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధార్థనగర్ కు చెందిన మహిళ ఆగస్టు 28న అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను ఘాజిపూర్ లోని ఆరావాళి మార్గ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఖర్చులను తట్టుకోలేక వైద్యుల అనుమతితో భర్తను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడుకుని భర్తతో ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఆ మహిళపై కన్నేసిన అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడు.. అర్ధరాత్రి ప్రయాణం కావడంతో పోలీసులు అపకుండా ఉండాలంటే ముందు కూర్చోవాలని బాధితురాలికి చెప్పారు. వారి దుర్బుద్ధిని పసిగట్టలేక బాధితురాలు అలానే చేసింది. మార్గమధ్యంలో బాధితురాలితో డ్రైవర్, అతడి సహాయకుడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితురాలు, ఆమె భర్త, సోదరుడు కేకలు వేశారు. గొడవ జరిగేలా ఉందని భావించిన డ్రైవర్.. చవానీ పోలీస్ స్టేషన్ రోడ్డులో అంబులెన్స్ ను ఆపేసి పేషెంట్ ను కిందికి దింపారు. ఆక్సిజన్ తొలగించి రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. పోతూ పోతూ బాధితురాలి దగ్గర ఉన్న రూ.10 వేలతో పాటు నగలను బలవంతంగా లాక్కుని పోయారు. ఆక్సిజన్ అందక భర్త పరిస్థితి విషమిస్తుండడంతో ఆ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మరో అంబులెన్స్ ను పిలిపించి పేషెంట్ ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గోరఖ్ పూర్ లోని మెడికల్ కాలేజీకి తరలిస్తుండగా మార్గమాధ్యంలోనే పేషెంట్ తుదిశ్వాస వదిలాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో ఘాజీపూర్ కు చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ పై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Admin
Studio18 News