Studio18 News - జాతీయం / : రాజ్‌కోట్ కోట బయట ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన తర్వాత అదృశ్యమైన శిల్పి జయదీప్ ఆప్టే రెండు వారాల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి పట్టుకునేందుకు పోలీసులు మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సచిన్ గుంజల్ సారథ్యంలో పోలీసు బృందం ఎట్టకేలకు నిందితుడిని కల్యాణ్‌లోని అతడి ఇంట్లో అరెస్ట్ చేసింది. జయదీప్‌పై లుక్ అవుట్ నోటీసులు ఇదే కేసులో ఇప్పటికే కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు జయదీప్ అరెస్టయ్యాడు. మహారాష్ట్ర సింధుదుర్గ్‌లోని రాజ్‌కోట్ కోట వద్ద ఏర్పాటు చేసిన 35 అడుగుల నిలువెత్తు శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలింది. ఈ కేసులో విగ్రహాన్ని చెక్కిన జయదీప్ ఆప్టేతోపాటు కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌ను నిందితులుగా చేర్చారు. పాటిల్‌ను వెంటనే అరెస్ట్ చేయగా, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆప్టేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకుని సింధుదుర్గ్ పోలీసులకు అప్పగించారు. అక్కడ అతడిని ప్రశ్నిస్తున్నారు. విగ్రహం కూలడానికి తప్పుడు డిజైన్, నిర్ణక్ష్యం, నిర్మాణ లోపాలు వంటివి కారణంగా తెలుస్తోంది. ఎవరీ శిల్పి ఆప్టే? శివాజీ విగ్రహం కూలిన తర్వాత జయదీప్ ఆప్టే పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల కుర్రాడు.. అందులోనూ రెండేళ్లకు మించి అనుభవం లేని, రెండడుగులకు మించి విగ్రహాలు చెక్కని జయదీప్‌కు 35 అడుగుల విగ్రహం కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారన్న దానిపై విపక్షాల నుంచి విమర్శల జడివాన కురిసింది. ఈ నేపథ్యంలో అతడితోపాటు అతడికి ఆ పని అప్పగించిన కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చేతన్‌ను అప్పుడే అరెస్ట్ చేయగా, తాజాగా జయదీప్‌ను అరెస్ట్ చేశారు.
Admin
Studio18 News