Studio18 News - క్రీడలు / : టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తాజాగా సంచలనం నమోదైంది. బాంగీలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్-ఏలో మంగోలియా జట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఇలా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. దీంతో పురుషుల టీ20లో అత్యల్ప స్కోరును సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా ఇలాగే పది పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇప్పుడు ఆ అత్యల్ప స్కోర్ రికార్డు సమం అయింది. ఇక మంగోలియా ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం మూడు పరుగులకే 6 వికెట్లు పడగొట్టాడు. ఇవి పురుషుల టీ20ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు. 17 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ తన మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. అలాగే పవర్‌ప్లేలో మంగోలియా కోల్పోయిన ఆరు వికెట్లలో ఐదు వికెట్లు భరద్వాజే తీశాడు. అనంతరం సింగపూర్ 11 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఐదు బంతుల్లోనే ఛేదించింది. ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇది ఆ జట్టుకు రెండో విజయం. ఇక మంగోలియా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
Admin
Studio18 News