Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సూపర్‌స్టార్ ఆధిపత్యానికి కాలం చెల్లిందని, మలయాళ చిత్ర పరిశ్రమను ఇక అది నియంత్రించలేదని ప్రముఖ రచయిత, కవి, సినీ గేయ రచయిత, దర్శకుడు శ్రీకుమరన్ థంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్ గొప్ప నటులని, అయినప్పకీ, వారు చిత్ర పరిశ్రమను నియంత్రించలేరని నొక్కి చెప్పారు. మోహన్‌లాల్ డేట్స్ ఇవ్వడం మానేశాడు తన పేరుతో నెలకొల్పిన అవార్డును మోహన్‌లాల్‌కు అందించిన రెండ్రోజుల తర్వాత థంపి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘నా సినిమా ‘యువజనోల్సవమ్’తో మోహన్‌లాల్ పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఆ తర్వాతి నుంచి నా సినిమాలకు డేట్స్ ఇవ్వడం మానేశాడు. ‘సూపర్‌స్టార్లు’, ‘మెగాస్టార్లు’ అనేవి గతంలో లేవు. వీరిద్దరి కోసమే ఆ ముద్రలు తయారుచేశారు. మమ్ముట్టి కూడా నా సినిమా ‘మున్నేటమ్’లో నటించాడు. ఆ తర్వాత అతడి స్థానాన్ని రథీశ్‌తో భర్తీ చేశాను. అప్పటి వరకు వినయంగా ఉండే మమ్ముట్టి ఆ తర్వాత మారిపోయాడు. ఓ సినిమాకు పాటలు రాయాల్సి ఉండగా ఆ మూవీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు. నన్ను తప్పించే విషయంలో సురేశ్ గోపీ కూడా కీలక పాత్ర పోషించాడు’ అని థంపి చేసిన వ్యాఖ్యలు మలయాళ చిత్రపరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. 23 సినిమాలు నిర్మించినా ధనవంతుడిని కాను.. జాతీయ అవార్డుల కమిటీలో తాను సభ్యుడినైనప్పటికీ మమ్ముట్టి, మోహన్‌లాల్‌కు అవార్డుల కోసం ప్రతిపాదించానని, తన వ్యక్తిగత అభిప్రాయాలను ఎప్పుడూ నిర్ణయాలపై రుద్దలేదని, వారి (మోహన్‌లాల్, మమ్ముట్టి) ప్రదర్శనపై అది ఎప్పుడూ ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడ్డానని శ్రీకుమరన్ థంపి గుర్తు చేసుకున్నారు. మోహన్‌లాల్‌కు అవార్డు ఇవ్వాలని తన ఫౌండేషన్ ప్రతిపాదించినప్పుడు కూడా తాను వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. 23 సినిమాలు నిర్మించినప్పటికీ తాను ధనవంతుడినేమీ కాదని స్పష్టం చేశారు.
Admin
Studio18 News