Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జస్టిస్ హేమ కమిటీ నివేదికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. తమిళ చిత్ర పరిశ్రమ ఎట్టకేలకు స్పందించింది. కేరళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరిగిన, జరుగుతున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనమైంది. ఇప్పటి వరకు దీనిపై అన్ని చిత్ర పరిశ్రమలు స్పందించినా కోలీవుడ్ మాత్రం పెదవి విప్పలేదు. తాజాగా, స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ ఆరోపణలపై తమిళ పరిశ్రమ స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కనీసం ఇప్పుడైనా మొదలు పెట్టాలని కోరారు. ఇండస్ట్రీలో మహిళలు సురక్షితంగా పనిచేసుకునే వాతావరణం అవసరమని పేర్కొన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, మనకు సురక్షితమైన చోటు అవసరమని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నేరస్తులకు కఠిన శిక్షలు అవసరమని నొక్కి చెప్పారు. మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడే ధైర్యం చేయనంత కఠినంగా ఆ శిక్షలు ఉండాలని చెప్పారు.. చిత్ర పరిశ్రమ సహా మీడియా, ఐటీ, స్పోర్ట్స్ వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు ఇదే విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై సింగర్ చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇండస్ట్రీ ఎలా స్పందించిందన్న ప్రశ్నకు ప్రభు బదులిస్తూ.. వీటి పరిష్కారానికి పరిశ్రమ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Admin
Studio18 News