Studio18 News - అంతర్జాతీయం / : యావత్ ఫ్రాన్స్ దేశాన్ని నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యపై 10 ఏళ్లపాటు ఏకంగా 92 అత్యాచారాలు చేయించాడు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి.. ఆమె మత్తులో ఉన్న సమయంలో అపరిచిత వ్యక్తులతో ఈ దురాగతాలు చేయించాడు. ఆన్‌లైన్‌లో రిక్రూట్ చేసుకున్న వ్యక్తులతో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నమోదైన ఆరోపణలపై నిందితుడు డొమినిక్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. కాగా బాధితురాలిపై మొత్తం 72 మంది వ్యక్తులు 92 సార్లు అత్యాచారాలు జరిపారు. వీరిలో 51 మందిని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన భర్త వీరందరినీ ఆన్‌లైన్‌లో రిక్రూట్ చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పేరు డొమినిక్ అని, అతడు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ యుటిలిటీ కంపెనీ ఈడీఎఫ్ మాజీ ఉద్యోగి అని, ప్రస్తుతం అతడి వయసు 71 సంవత్సరాలు అని వివరించారు. అత్యాచారాలకు పాల్పడ్డ నిందితుల వయసు 26-74 సంవత్సరాల మధ్య ఉంటుందని బాధితురాలి న్యాయవాదులు చెప్పారు. డ్రగ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో తనపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆమె 10 ఏళ్లపాటు గుర్తించలేకపోయారని వెల్లడించారు. కాగా బాధితురాలి అభ్యర్థన మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయనున్నట్టు విచారణ జరుపుతున్న జడ్జి రోజర్ తెలిపారు. తనలా మరొకరికి జరగకూడదని, అందుకే ఈ ఘటనపై విస్తృత ప్రచారం చేయాలనుకుంటున్నట్టు బాధితురాలు చెప్పారని, ఆమె కోరిక మేరకే వివరాలను వెల్లడిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు బాధితురాలి అభ్యర్థనకు కోర్టు అంగీకారం తెలిపిందని ఆమె తరపు న్యాయవాదుల్లో ఒకరైన స్టెఫాన్ తెలిపారు. ఈ విచారణ ఆమెకు భయంకరమైన పరీక్ష అని మరో న్యాయవాది ఆంటోయిన్ వ్యాఖ్యానించారు. తన క్లయింట్ అఘాయిత్యాలను జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నారని వివరించారు. కాగా బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కేసు విచారణలో పిల్లలు కూడా ఆమెకు మద్దతు ఇస్తున్నారని లాయర్ చెప్పారు. బయటపడిందిలా.. సెప్టెంబరు 2020లో ఒక షాపింగ్ సెంటర్‌లో ముగ్గురు మహిళలను స్కర్ట్‌ల కింద నుంచి రహస్యంగా చిత్రీకరిస్తున్న సమయంలో నిందితుడు పి.డొమినిక్‌ను సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అతడి కంప్యూటర్‌లో భార్యకు సంబంధించిన వందలాది వీడియోలు కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోల్లో ఆమె స్పృహ కోల్పోయి ఉంది. అవిగ్నాన్ పట్టణానికి 33 కిలోమీటర్లు దూరంలో ఉన్న మజాన్‌లో దంపతులు నివాసం ఉన్న ఇంట్లో డజన్ల కొద్దీ అత్యాచారాలు జరిగాయని ఈ వీడియోల ద్వారా బహిర్గతమైందని పోలీసులు తెలిపారు. వీడియోలను చూసిన చాలామంది బాధితురాలు తన భర్తకు సహకరిస్తోందని భావించారు. కానీ తర్వాత అందరికీ అసలు విషయం అర్థమైంది.
Admin
Studio18 News