Studio18 News - జాతీయం / : wolves attack in uttarpradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తోడేళ్ల దాడిని అరికట్టేందుకు , తోడేళ్ల గుంపును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ‘ఆపరేషన్ బేడియా’ను ప్రారంభించారు. అయినా ఆదివారం తెల్లవారుజామున తోడేళ్ల గుంపు గ్రామస్తులపై దాడి చేయడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తెల్లవారుజామున సమయంలో తోడేళ్ల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లి మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. మా ఆరునెలల పాప ఏడుపు విని మేల్కొన్నాను. అప్పుడే నా రెండేళ్ల కూతుర్ని తోడేళ్లు ఈడ్చుకెళ్లాయని ఆమె తెలిపింది. మేము కూలీలం. మా ఇంటికి తలుపుకూడా లేదు. అందుకే ఈ ఘటన జరిగింది. తోడేలు నా కూతురి రెండు చేతులను కొరికేసిందని మృతిరాలి తల్లి కన్నీరుమున్నీరైంది. ఘటన జరిగిన ప్రాంతంలో గతంలోనూ పలుసార్లు తోడేళ్ల సంచారం కనిపించింది. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు పట్టించుకోలేదని విమర్శించారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ప్రాంతంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. రాత్రిపూట ఇంట్లోనే నిద్రపోవాలని, జాగ్రత్తగా ఉండాలని వారికి గతంలో సూచనలు చేశామని చెప్పారు. మొత్తం ఆరు తోడేళ్లు సంచరిస్తున్నాయని అధికారులు భావిస్తుండగా.. నాలుగు తోడేళ్లు పట్టుకున్నారు. మరో రెండు తోడేళ్లను త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బహ్రైచ్ జిల్లాలోనే గడిచిన 45 రోజుల్లో తోడేళ్ల దాడిలో ఎనిమిది మంది పిల్లలు, ఒక మహిళసహా తొమ్మిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. వరుస ఘటనల్లో జిల్లాలోని 35గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలాఉంటే.. తోడేళ్లను పట్టుకునేందుకు రంగురంగుల టెడ్డీ బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపి తోడేళ్లు విశ్రాంతి తీసుకుంటున్న డెన్లు, నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారుల ప్రయత్నం ఫలిస్తే స్థానికంగా తోడేళ్ల దాడులు తగ్గే అవకాశం ఉంది.
Admin
Studio18 News