Studio18 News - అంతర్జాతీయం / : Karachi Dream Bazaar Mall Looted: అదో కొత్త షాపింగ్ మాల్. ఓపెనింగ్ రోజు భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఇంకేముంది జనం ఎగబడ్డారు. ఊహించని విధంగా జనం రావడంతో వారిని కంట్రోల్ చేయలేక షాపింగ్ మాల్ నిర్వాహకులు చేతులు ఎత్తేశారు. దొరికిందే సందని షాపింగ్ మాల్‌లోకి చొచ్చుకొచ్చిన జనం చేతికందిన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. షాక్ తినడం షాపింగ్ మాల్ నిర్వాకుల వంతైంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పాకిస్తాన్‌లోని కరాచీ నగరం గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో డ్రీమ్ బజార్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీ వ్యాపారవేత్త ఒకరు డ్రీమ్ బజార్ మాల్ పేరుతో షాపింగ్ మాల్ పెట్టారు. ఓపెనింగ్ రోజు భారీగా ఆఫర్లు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. దీంతో మాల్ ఓపెనింగ్ రోజు జనం పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జనాన్ని కంట్రోల్ చేయలేక మాల్ సిబ్బంది గేట్లు మూసివేసే ప్రయత్నం చేయగా వారిని తోసుకుంటూ జనం లోపలికి చొచ్చుకొచ్చారు. డ్రీమ్ బజార్ మాల్ లోపలికి వచ్చినవారు చేతికందిన వస్తువులను దోచుకెళ్లార ని ARY న్యూస్ నివేదించింది. పోలీసుల జాడ లేకపోవడంతో జనం మరింత రెచ్చిపోయారు. మాల్‌లో వస్తువులను చిందరవందరగా పడేసి, రచ్చరచ్చ చేశారు. అరగంటలో షాపింగ్ మాల్ లూటీ చేశారు. కొంతమంది అయితే తామేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా లూటీని కూడా సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. డ్రీమ్ బజార్ మాల్ లూటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. దీనిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. డ్రీమ్ బజార్ మాల్ మంచి ఉద్దేశంతోనే ఆఫర్లు ప్రకటించినప్పటికీ.. జనాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని నెటిజనులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో రద్దీకి అనుగుణంగా సెక్యురిటీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కృతజ్ఞతతో ఉండండి అంతేకానీ దోచుకోవడానికి ప్రయత్నించొద్దని కొంతమంది ఉద్భోదించారు.
Admin
Studio18 News