Studio18 News - జాతీయం / : తన కారును వెనుక నుంచి ఢీకొట్టిన ఓలా క్యాబ్ డ్రైవర్ ను ఆడీ కారు ఓనర్ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓలా డ్రైవర్ ను రెండు చేతులతో పైకెత్తి నేల కేసి కొట్టాడు. దీంతో ఓలా డ్రైవర్ కనీసం కదలలేని స్థితిలో నేలపై పడిపోయాడు. అయినా వదలకుండా కాళ్లతో తన్నుతూ అతనిని చితకబాదాడు. దీనికి సంబంధించిన 30 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. ముందు ఆడీ కారు వస్తుండగా దాని వెనుక ఓలా క్యాబ్ వస్తున్నట్టు వీడియోలో ఉంది. ఆడీ యజమాని తన కారుకు బ్రేక్ వేసినప్పుడు... వెనుక నుంచి ఓలా క్యాబ్ బంపర్ ఆడీని ఢీకొట్టింది. వెంటనే ఆడీ ఓనర్ రిషబ్ చక్రవర్తి, ఆయన భార్య అంతారా ఘోష్, మరో మహిళ కారు నుంచి కిందకు దిగారు. తమ కారుకు డ్యామేజ్ జరిగిందా అని ఒక్క క్షణం చెక్ చేశారు. ఆ తర్వాత ఓలా డ్రైవర్ ఖయాముద్దీన్ ను బండ బూతులు తిడుతూ దాడి చేశాడు. ఖయాముద్దీన్ ను నేలకేసి బలంగా కొట్టడంతో... అతని తల నేలను బలంగా ఢీకొంది. దీంతో నేలపై అతను చలనం లేకుండా పడిపోయాడు. ఈ నెల 18న అర్ధరాత్రి సమయంలో ముంబైలో ఈ ఘటన జరిగింది. ఒక మాల్ కు ఎదురుగా ఉన్న ఓ బిల్డింగ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News