Studio18 News - అంతర్జాతీయం / : Norway princess Martha Louise: నార్వే యువరాణి మార్తా లూయిస్(52) తన కంటే వయసులో మూడేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు డ్యూరెక్ వెరెట్(49)ను ఈ వారాంతంలో పెళ్లి చేసుకోబోతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన నార్వేలోని గీరాంజర్‌లో వీరి పెళ్లి జరగనుంది. అలెసుండ్‌లోని ఒక చారిత్రాత్మక హోటల్‌లో “మీట్ అండ్ గ్రీట్”తో వివాహ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. స్వీడిష్ రాజకుటుంబ సభ్యులు, అమెరికన్ టీవీ ప్రముఖులతో సహా వందలాది మంది అతిథులు వేడుకలకు హాజరయ్యారు. ఇక్కడి నుంచి గీరాంజర్‌కు బోటులో వెళ్లి మార్తా, వెరెట్ పెళ్లి చేసుకుంటారని స్థానిక మీడియా వెల్లడించింది. నార్వే రాజు హరాల్డ్ పెద్ద కుమార్తె అయిన మార్తా లూయిస్‌కు ఇది రెండో పెళ్లి. 2002లో ప్రముఖ రచయిత అరి బెన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు కుమార్తెలు సంతానం. వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2017లో విడిపోయింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత 2019లో అరి బెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అదే ఏడాది ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెరెట్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని బయట ప్రపంచానికి మార్తా లూయిస్ వెల్లడించింది. “నేను నా సమయాన్ని గడపడానికి ఇష్టపడే వ్యక్తి” అంటూ అతడి వ్యక్తిత్వం గురించి వివరించింది. 2022, జూన్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆఫ్రికల్ అమెరికన్ అయిన డ్యూరెక్ వెరెట్‌పై వివాదాలు కూడా ఉన్నాయి. ఆత్మ, మరణం గురించి అతడు ప్రచారం చేసే అంశాలపై విమర్శలు ఎదుర్కొన్నాడు. తనకు 28 ఏళ్ల వయసులో చావు నుంచి బయటపడ్డానని.. మరణం నుంచి పునరుజ్జీవనం పొందానని అతడు చెప్పుకుంటు ఉంటాడు. క్యాన్పర్, కరోనా రోగాలను నయం చేస్తానంటూ అతడు కోట్లాది రూపాయలు సంపాదించాడు. గ్వినేత్ పాల్ట్రో, ఆంటోనియో బాండెరాస్ వంటి ఎందరోప్రముఖులకు అతడు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్నాడు. వెరెట్ మంత్రగాడు, పిచ్చోడని నార్వే మీడియా విమర్శించినా యువరాణి లూయిస్ మాత్రం అతడిని పెళ్లాడేందుకు సిద్ధపడటం గమనార్హం.
Admin
Studio18 News