Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi – Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా చిరు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటకు చెప్పేశారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ రోజున ఇంద్ర మూవీని రిరీలిజ్ చేశారు. థియేటర్లలో ఈ సినిమాను చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. రి రిలీజ్‌లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. దీంతో ఇంద్ర చిత్ర బృందాన్ని చిరు తన ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు. నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, చిన్నికృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మలను సన్మానించిన అనంతరం వారితో చిరు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంద్ర సినిమా సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ.. జన్మకి ఒక పాట అంటారు గదా ఇంద్ర మూవీకి తాను కంపోజ్ చేసిన ‘భం భం బోలే’ సాంగ్ అలాంటిది అంటారు. వెంటనే చిరు మాట్లాడుతూ.. విశ్వంభర టాపిక్‌ను తీసుకువచ్చారు. ఇటీవల విశ్వంభర కంపోజింగ్ కోసం బెంగళూరుకు వెళ్లాం కీరవాణి దగ్గరికి.. విశ్వంభర మూవీకి సంబంధించి ఒక భక్తి పాట కావాలని.. అది ‘భం భం బోలే’ లాంటి సౌండింగ్, ఆ రిథమ్‌లో ఒక వైబ్రెంట్ సాంగ్ అయి ఉండాలని కీరవాణి దగ్గర దర్శకుడు వశిష్ఠ పట్టుబట్టారు. ఇక కీరవాణి కూడా తప్పకుండా ఇస్తానయ్యా అంటూ మాటిచ్చారు. అన్నట్లుగానే రాములవారిపై అద్భుతమైన పాటను ఇచ్చారు. త్వరలోనే మీరు చూడబోతున్నారు అంటూ చిన్న లీక్ ఇచ్చారు చిరు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Admin
Studio18 News