Studio18 News - జాతీయం / : Jammu and Kashmir Elections 2024 : జమ్మూకశ్మీర్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు తేదీలనుసైతం ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. మరోవైపు.. బీజేపీ అధిష్టానం తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను సోమవారం ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. త్వరలో ఇండియా కూటమి పార్టీలు కూడా తమతమ పార్టీల అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 50 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయనుంది. 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనుండగా.. సీపీఐ(ఎం), జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ చెరొక స్థానంలో పోటీ చేయనున్నాయి. మిగిలిన ఆరు స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి ఇండియా కూటమిలోని పార్టీలు నిర్ణయించాయి. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, గులాం నబీ ఆజాద్ కు చెందిన డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఆప్ అధిష్టానం ఇప్పటికే ఏడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేయడం ఇదే తొలిసారి. మరోవైపు డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తొలి దశలో (సెప్టెంబర్ 18న) 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో (సెప్టెంబర్ 25న) 26 స్థానాలకు, మూడో దశలో (అక్టోబర్ 1న) 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Admin
Studio18 News