Studio18 News - అంతర్జాతీయం / : యుక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి చేసింది. 100కి పైగా క్షిపణులు, 100 డ్రోన్‌లతో తమ దేశంపై రష్యా దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం టెలిగ్రామ్‌లో వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. యుక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని అన్నారు. జెలెన్‌స్కీ ఈ ప్రకటన చేయడానికి ముందు కూడా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రష్యా దాడులపై పలు వార్తలు వెల్లడించాయి. ఇంధన మౌలిక సదుపాయాల సంస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఇవాళ ఉక్రెయిన్ అంతటా భారీ డ్రోన్, క్షిపణులతో దాడి చేసిందని తెలిపాయి. దీంతో యుక్రెయెన్ వ్యాప్తంగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని చెప్పాయి. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్‌సోనిక్ బాలిస్టిక్ కింజాల్ క్షిపణులను 15 యుక్రేనియన్ ప్రాంతాలపై రష్యా ప్రయోగించిందని తెలిపాయి. ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదే. చాలా కాలంగా యుక్రెయిన్‌లోని మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. రష్యా, యుక్రెయిన్ వార్‌లో ఇప్పటివరకు జరిగిన నష్టానికి ఓ అంచనా అంటూ లేదు. రెండు వైపులా భారీగా నష్టం జరుగుతూనే ఉంది. రష్యా మొదటి నుంచి చేస్తున్న దాడులను అమెరికా, యూరప్ దేశాల మిలటరీ సాయంతో యుక్రెయిన్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.
Admin
Studio18 News