Studio18 News - అంతర్జాతీయం / : Ladakh Gets 5 New Districts : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్ లో పోస్టు చేశారు. లడఖ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పటివరకు లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నాయి. ప్రస్తుతంగా లడఖ్ లోని జంస్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన సుసంపన్నమైన లడఖ్‌ను నిర్మించాలనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను అనుసరించి, కేంద్రపాలిత ప్రాంతంలో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోంశాఖ నిర్ణయించిందని అమిత్ షా తెలిపారు. లడఖ్‌లో జిల్లాల ఏర్పాటు ద్వారా పాలనను పటిష్టం చేయడం ద్వారా ప్రజలకు ఉద్దేశించిన ప్రయోజనాలను వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లబడతాయని పేర్కొన్నారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్విటర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న పూర్వపు జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(యూటీ) కేంద్రం విభజించిన విషయం తెలిసిందే. దీంతో జమ్మూఅండ్ కాశ్మీర్ తోపాటు లడఖ్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది. యూటీ అయినందున లడఖ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలోకి వస్తుంది. లడఖ్ లో రెండు జిల్లాలు ఉండగా.. కొత్తగా కేంద్ర హోం శాఖ ఐదు జిల్లాలను ఏర్పాటు చేసింది.
Admin
Studio18 News