Studio18 News - జాతీయం / : BJP Candidates List For Jammu-Kashmir Election 2024 : జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో 26 స్థానాలకు, మూడో దశలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను 44 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో విడత కోసం 19 మంది అభ్యర్థుల పేర్లను కమలదళం ఖరారు చేసింది. బీజేపీ తొలి జాబితాలో కీలక నియోజకవర్గాలైన అనంత్ నాగ్ వెస్ట్ నుంచి మహమ్మద్ రఫీక్ వనీ, పాంపోర్ నియోజకవర్గం నుంచి సయ్యద్ షోకాత్ గయూర్ అంద్రబీ, షోపియాన్ నుంచి జావెద్ అహ్మద్ ఖాద్రి, అనంత్ నాగ్ నుంచి సయ్యద్ వజాహత్, దోడా నుంచి గజయ్ సింగ్ రాణా తదితరులు పోటీలో ఉన్నారు. తొలి జాబితాలో 14 మంది ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టికెట్లు కేటాయించింది. జమ్మూకశ్మీర్ లో చివరిసారి 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఐదు దశలో ఎన్నికలు నిర్వహించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవ్వడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తరువాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ దఫా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Admin
Studio18 News