Studio18 News - జాతీయం / : దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, నేరాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మరో దారుణం వెలుగుచూసింది. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో దొంగతనానికి వచ్చిన 29 ఏళ్ల ధనేష్ అనే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోని నగలు దోచుకున్న అనంతరం వృద్ధురాలి కళ్లలో కారం చల్లి నిందితుడు పారిపోయాడని పోలీసులు వివరించారు. వృద్ధురాలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆమె వద్ద ఫోన్‌ను కూడా తీసుకొని, ఇక ఇంట్లో నుంచి బయటకు రాకుండా వెలుపల తాళం వేసి పరారయ్యాడని వివరించారు. కాయంకుళంలోని బాధితురాలి నివాసంలో ఈ దారుణం జరిగిందని పోలీసులు చెప్పారు. ఓ దుకాణంలో నగలు విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని వెల్లడించారు. బాధితురాలు ఒంటరిగా నివసిస్తోందని తెలుసుకున్న తర్వాతే ఆమెను టార్గెట్ చేశాడని, సుమారు ఏడు తులాల బంగారం దొంగిలించాడని పేర్కొన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం పొరుగు వారు విషయాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారని, తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు.
Admin
Studio18 News