Studio18 News - జాతీయం / : Kishan Reddy: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 370ని రద్దు చేసిన తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికలు మీ అభివృద్ధిని కొనసాగించే ఎన్నికలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కశ్మీర్ ప్రజలకు సూచించారు. ఉగ్రవాదులను మన దేశంలోకి పంపిస్తూ విధ్వంసానికి కారణమవుతున్న పాకిస్తాన్‌తో చర్చలు అవసరమా అని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్‌తో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. ఫారుఖ్ అబ్దుల్లా ఇంటికెళ్లి ఒప్పందం చేసుకుని వచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ”అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్‌ని సమర్థిస్తారా?, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకంగా ఓ జెండా ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ హామీని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా?, ఉగ్రవాదులను విడుదల చేస్తామంటున్న ఎన్సీకి మద్దతుగా ఉంటారా? పాకిస్తాన్ తో మళ్లీ చర్చలు జరపడం, తద్వారా లోయలో మళ్లీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచనకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందా? పాకిస్తాన్‌తో ‘సరిహద్దు వాణిజ్యం’ పేరుతో.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? దళిత, గుజ్జర్, బకర్‌వాల్, ఇతర వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు చరమగీతం పాడాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ దురుద్దేశాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందా?, ‘శంకరాచార్య హిల్’ను ‘తఖ్తే సులేమాన్’గా.. ‘హరిపర్వత్’ను ‘కోహేమారన్’గా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? పాలనను కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా ఉండే కుటుంబాలకు కట్టబెట్టడం ద్వారా.. జమ్మూకశ్మీర్ ఆర్థిక పరిస్థితిని మళ్లీ అవినీతి, అక్రమాల్లోకి నెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? జమ్మూ, కశ్మీర్ లోయ మధ్య వివక్ష రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందా? కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో.. రాష్ట్రంలో విభజన రాజకీయాలకు బాటలు వేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
Admin
Studio18 News