Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో ఆ దేశం నుంచి భారత్ లోకి వచ్చేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. వీరిలో అత్యంత ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా భారత్ లోకి వచ్చేందుకు యత్నించిన ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షంషుద్దీన్ చౌదురి మాణిక్ ను ఇండో-బంగ్లా సరిహద్దు వద్ద ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సెల్హెట్ లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్ లోకి వెళ్లేందుకు యత్నించిన షంషుద్దీన్ చౌదురిని అదుపులోకి తీసుకున్నామని బంగ్లాదేశ్ సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు అవామీ లీగ్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె ప్రభుత్వం కూలిపోవడంతో... అక్కడ తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. అనంతరం షేక్ హసీనా ప్రభుత్వంలోని పలువురు మంత్రులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు షేక్ హసీనాను తమకు చట్టబద్ధంగా అప్పగించాలని కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. హసీనాపై ఆ దేశంలో హత్య అభియోగాలతో కూడా కేసులు నమోదయ్యాయి. ఆమెను విచారించేందుకు తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ ను కోరింది.
Admin
Studio18 News