Studio18 News - జాతీయం / : అస్సాంలో బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో ‘సీన్ రిక్రియేషన్’ కోసం నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులకు మస్కా కొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దగ్గర్లో ఉన్న ఓ చెరువులో దూకాడు. తెల్లారేటప్పటికి ఆ చెరువులో శవమై తేలాడు. నాగౌన్ జిల్లా ధింగ్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధింగ్ గ్రామంలో గురువారం ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న పద్నాలుగేళ్ల బాలికపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రదేశంలో ముగ్గురూ సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితులను పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అవాంఛిత ఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించి.. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలంటూ డీజీపీని ఆదేశించారు. ఈ క్రమంలోనే అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుకున్న నిందితుడిని విచారించే క్రమంలో శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రికన్ స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులకు దొరకకూడదనే టెన్షన్ తో పరుగు తీస్తూ అక్కడికి దగ్గర్లోని చెరువులో దూకాడు. పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. తెల్లవారిన తర్వాత గజ ఈతగాళ్లతో గాలించగా.. నిందితుడి శవం బయటపడిందని అధికారులు తెలిపారు. నిందితుడు తప్పించుకునే క్రమంలో ఓ కానిస్టేబుల్ ను గాయపరిచాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఎలా తప్పించుకోగలిగాడనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Admin
Studio18 News