Studio18 News - అంతర్జాతీయం / : భారతీయులకు పొరుగు దేశం శ్రీలంక తీపి కబురు చెప్పింది. భారత పౌరులకు ఆరు నెలల పాటు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. భారత్ సహా 35 దేశాల వారికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో తెలిపారు. భారత్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జపాన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలు వీసా ఫ్రీ జాబితాలో ఉన్నాయి. కాగా, శ్రీలంకలో ఆన్ అరైవల్ వీసాల కోసం పెరిగిన ఛార్జీలను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం నేపథ్యంలో అక్కడి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుండి వచ్చే ప్రయాణికులకు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను గతేడాది అక్టోబర్‌లో శ్రీలంక తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను చేర్చి ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను విస్తరించింది. ఇక పైలట్ ప్రాజెక్ట్‌లోని ప్రయాణికులు శ్రీలంకకు రాగానే డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇస్తారు. ఫ్రీ వీసా ద్వారా శ్రీలంకలో 30 రోజుల వరకు బసకు అవకాశం ఉంటుంది. కాగా, శ్రీలంకకు ఇండియానే టాప్ ఇన్‌బౌండ్ టూరిజం మార్కెట్. గతేడాది అక్టోబర్ లో ఆ దేశానికి వెళ్లిన భారతీయ పర్యాటకుల సంఖ్య 28వేల కంటే ఎక్కువ. ఇది ఆ దేశ పర్యాటకుల సంఖ్యలో 26 శాతం. ఇలా భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అలాగే రష్యా 10 వేల మంది పర్యాటకులతో రెండో స్థానంలో నిలిచింది. భారత్, శ్రీలంక స్నేహపూర్వక సంబంధం "మా విదేశాంగ విధానంలో చాలా ముఖ్యమైంది" అని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. శ్రీలంక పర్యాటక రంగానికి ప్రధాన వనరు ఇండియానే అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే 30,000 మంది భారతీయులు వచ్చారని తెలిపారు. శ్రీలంక ఎంపీ వీ రాధాకృష్ణన్ కూడా శ్రీలంక పర్యాటకానికి భారతీయులే కీలకం అని అన్నారు. శ్రీలంకకు వచ్చే సందర్శకులలో 60 శాతం భారతదేశం నుండి వస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
Admin
Studio18 News