Studio18 News - జాతీయం / : మంచు కొండల్లో మంటపుట్టిస్తున్నాయి పాలిటిక్స్… నెలరోజుల్లో జమ్మూకశ్మీర్ కు ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో కశ్మీర్‌పై ఫోకస్ పెంచింది బీజేపీ.. కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకంతో ఎన్నికలకు సిద్ధమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో కమలదళం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇంతకీ బీజేపీ వ్యూహమేంటి? లోయలో రాజకీయంగా పట్టు సాధిస్తుందా..? నేషనల్ పార్టీలకు గట్టి పోటీనిస్తున్న లోకల్ పార్టీలకు చెక్ పెట్టే సత్తా కాషాయదళానికి ఉందా..? బీజేపీ మిషన్ కశ్మీర్‌ను ఎలా అమలు చేయాలనుకుంటోంది..? జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నగారా మోగింది మొదలు శరవేగంగా పావులు కదుపుతూ దూకుడు పెంచుతోంది బీజేపీ. కలిసివచ్చే పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో టచ్‌లో ఉంటూ.. ఎలాగైనా ఈసారి కశ్మీర్‌లో కాషాయం జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. పైగా సింగిల్‌గానే బరిలో దిగుతున్నామని తేల్చడంతో రాజకీయం మరింత రసకందాయంలో పడింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జులుగా తెలుగువాళ్లు, బీజేపీలో సీనియర్‌లుగా పేరున్న నేతలను నియమించింది బీజేపీ అధిష్టానం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను బీజేపీ అధిష్ఠానం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడంలో కిషన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. రామ్ మాధవ్ కీలకపాత్ర మరోపక్క రాం మాధవ్ 2014 నుంచి 2020 మధ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గతంలో జమ్మూకశ్మీర్, అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టిన అనుభవం ఆయనది. సెప్టెంబర్ 26, 2020న పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. 2014లో జమ్మూ కశ్మీర్ ఎన్నికల సమయంలో రామ్ మాధవ్ కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో రామ్ మాధవ్ సక్సెస్ అయ్యారు. పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రామ్ మాధవ్ పాత్రే కీలకం. ఇప్పుడు మరోసారి జమ్మూకశ్మీర్‌లో పాగావేయాలని బరిలో దిగుతున్న బీజేపీ.. వ్యూహాత్మకంగానే రామ్ మాధవ్‌కు ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలప్పజెప్పింది. జమ్మూకశ్మీర్ స్థానిక రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది. దీంతో లోకల్‌గా రాజకీయ వ్యూహాలు అమలు చేయాలంటే.. సీనియర్ అయిన రాంమాధవ్ అవసరం పార్టీకి ఉందని భావిస్తోంది కమలం అధిష్టానం. గతంలో పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేసింది బీజేపీ. ఇప్పుడు ఆ పరిస్థితుల్లేవు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కశ్మీర్‌లో రాజకీయంగా బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కమలదళం..ఈమధ్యే మాజీ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీని బీజేపీలో చేర్చుకుంది. ఆయన రాకతో పార్టీ మరింత బలపడినట్లు చెబుతున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ లోయలో 8 నుంచి 9 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వీరిని కూడా తమవైపునకు తిప్పుకోవడం ద్వారా.. సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకోవచ్చన్న లెక్కలు ముందు నుంచే వేసుకుంటోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దయ్యింది. దీంతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రహోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం ఇదే తొలిసారి. 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశ, సెప్టెంబర్ 25న రెండోదశ, అక్టోబర్ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో నెల రోజుల ముందు నుంచే బీజేపీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది. ఇటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు కూడా తమ సత్తాను చాటేందుకు సరంజమా సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్‌లో పట్టు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లోకల్ పార్టీలను గ్రిప్‌లో పెట్టుకుంటే విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావిస్తున్నారు. ఎలాగైనా ఎన్డీయే కూటమి ఇక్కడ జెండా ఎగరనీయకుండా చేయాలనేదే హస్తం పార్టీ ప్రధానమైన వ్యూహంగా ఉంది. దీనికోసం అవసరమనుకుంటే శత్రుత్వం ఉన్న పార్టీలతోనూ మిత్రత్వం చాటేలా స్నేహగీతం పాడుతోంది కాంగ్రెస్. దీంతో బీజేపీ వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సి వస్తోంది. అందుకే రాజకీయంగా కాకలుతీరిన వారంతా ఇప్పుడు కశ్మీర్‌లో కాషాయం జెండా ఎలా ఎగరేయాలన్న మిషన్‌లో భాగంగా మారిపోతున్నారు.
Admin
Studio18 News