Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకీ హైఓల్టేజ్ మ్యాచ్‌లా మారుతున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ప్రకటించాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కమలా హ్యారిస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. అప్పటి వరకూ ముందంజ వేసిన రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకబడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలా హ్యారిస్‌దే విజయమంటున్నాయి సర్వేలు. దీంతో రిపబ్లికన్ పార్టీలో గుబులు మొదలైంది. ఇటు డెమోక్రటిక్ పార్టీ నుంచి ట్రంప్‌పై విమర్శల దాడి కూడా ఓ రేంజ్‌లో పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రచారంలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. సర్వేలన్నీ కూడా కమలాకు అనుకూలంగా వస్తున్నాయి. చికాగోలో డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె గ్రాఫ్ మరింత స్పీడుగా పెరుగుతోందన్నది సర్వేలు చెబుతున్నమాట. అయితే ప్రత్యర్థి పార్టీ నుంచి వస్తున్న విమర్శలను అంతే దీటుగా తిప్పికొట్టాల్సిన అవసరముందని డెమోక్రటిక్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విమర్శలకు అంతే దీటుగా జవాబిస్తోంది డెమొక్రటిక్ పార్టీ. చికాగో డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ట్రంప్‌పై నాన్‌స్టాప్‌గా విమర్శలు పేల్చిపారేశారు. ట్రంప్ అమెరికాకు అతిపెద్ద ప్రమాదకారి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చారంటే.. దేశం డేంజర్‌లో పడినట్లేనన్నారు ఒబామా. ట్రంప్ ప్రమాదకర నాయకత్వంలో మరో నాలుగేళ్లు అమెరికా ముందుకెళ్లే డేంజరస్ ఫీట్ చేయలేదన్నారు. సర్వేల్లో అంచనాలు ఎలా ఉన్నాయి? ఆగస్ట్ 18నాటికి సర్వేల్లో కమలా హ్యారిస్‌కు 225 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, డొనాల్ట్ ట్రంప్‌కు 219 ఓట్లు వస్తాయని అంచనాలు వచ్చాయి. వాష్టింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ ఐపోస్ పోల్ సర్వేలోనూ ట్రంప్ కంటే కమలా హ్యారిస్‌కు నాలుగు పాయింట్లు ఎక్కువ వచ్చాయి. ఇందులో కమలా హ్యారిస్‌కు 49 శాతం, డొనాల్డ్ ట్రంప్‌నకు 45 శాతం మద్దతు ఉన్నట్టు తేలింది. ఒకవేళ న్యూట్రల్‌గా ఉండే వారిని పరిగణనలోకి తీసుకుంటే హ్యారిస్‌దే ఆధిపత్యమని తేల్చింది. బైడెన్ బరిలో ఉన్నప్పుడు దూసుకెళ్లిన ట్రంప్ గ్రాఫ్.. కమలా హ్యారిస్ ఎంట్రీతో డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. దీంతో ట్రంప్ కూడా తనదైన పొలిటికల్ స్ట్రాటజీస్‌ను ఉపయోగిస్తున్నారు. అడుగడుగునా దూకుడుగా మాటల తూటలను పేల్చుతున్నారు. గతంలో బైడెన్ దొంగ, మోసగాడు, అబద్దాల కోరు, చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ నోరు పారవేసుకున్నారు ట్రంప్. ఇప్పుడు సీన్‌లోకి కమలా హ్యారిస్ రాగానే.. అదే రేంజ్ మాటల దాడిని తీవ్రం చేశారు. కమలా హ్యారిస్ కూడా దొంగ, అబద్దాల కోరు, ఆమె నిజంగా నల్ల జాతీయురాలు కాదు అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. కమలా సరిగా అమెరికన్ ఇంగ్లిష్ మాట్లాడలేరని.. ఆమె సభలకు జనం కూడా రావడం లేదంటూ క్రిటిసైజ్ చేశారు. అంతే కాదు.. హ్యారిస్ సభలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జనం పెద్ద ఎత్తున వస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దీంతో అమెరికా ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా విమర్శలు, ప్రతివిమర్శలు, తిట్లు, శాపనార్థాలు పరిధుల్ని దాటేశాయి. పార్టీ నుంచి మొదలై నేతలు, వారి వ్యక్తిగత విషయాలను కూడా వదలకుండా ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు.
Admin
Studio18 News