Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ లో విద్యార్థులు, ప్రజల ఆందోళనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. దేశం విడిచిపెట్టి భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, హసీనాకు ఆశ్రయమివ్వడంపై భారత్ ను బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ పీ) విచారం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ప్రజల విజయాన్ని అడ్డుకోవడానికి హసీనా భారత్ నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఆమెను వెంటనే తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన ఆందోళనలలో విద్యార్థులతో పాటు బీఎన్ పీ పార్టీ కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆందోళనలలో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడం, వారి మరణానికి కారణం మాజీ ప్రధాని హసీనా, ఆమె అనుచరులేనని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హసీనాపై రెండు హత్యలతో పాటు 31 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి హసీనాను విచారించాల్సి ఉందని, న్యాయబద్ధంగా ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలని బీఎన్‌పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగిర్ కోరారు.
Admin
Studio18 News