Studio18 News - జాతీయం / : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనతో ప్రధాని మోదీ మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఈ పర్యటనలో వివిధ కీలక అంశాలలో భాగస్వామ్యం, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై పోలాండ్ అధ్యక్షుడితో మోదీ చర్చించనున్నారని తెలిపింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పోలాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు. కాగా, పోలాండ్ పర్యటన ముగించుకుని ఈ నెల 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ తో చర్చలు జరపనున్నారు.
Admin
Studio18 News