Studio18 News - అంతర్జాతీయం / : ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన షిప్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. సిసిలియన్ పోర్టు నుండి ఈయాట్ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ మునిగిపోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ లు రంగంలోకి దిగాయి. నౌకను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బ్రిటన్ వ్యాపార దిగ్గజం మైక్ లించ్ గల్లంతు కాగా, ఆయన భార్యతో పాటు మరో 14 మంది ప్రమాదం నుండి బయటపడ్డారు. గల్లంతైన వారిలో నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, గల్లంతైన వ్యాపారవేత్త మైక్ లించ్ (59) అమెరికాలో మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన 1990లో టెక్ దిగ్గజ సంస్థ ఆటానమీ కార్పోరేషన్ ను ప్రారంభించారు.
Admin
Studio18 News