Studio18 News - అంతర్జాతీయం / : Donald Trump : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా.. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలాహరిస్ బరిలో నిలిచింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధ మరింత తీవ్రమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలాహరిస్ పై పదేపదే వ్యక్తిగత విమర్శలకు దిగుతుండగా.. కమలాహరిస్ సైతం ధీటైన సమాధానం ఇస్తుంది. తాజాగా జరిగిన సభలో ట్రంప్ మాట్లాడుతూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్లా సీఈవో, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, కమలాహరిస్ లను ఎక్స్ (ట్విటర్) లో ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో మస్క్ ను డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అతను గొప్ప ఉత్పత్తులను తయారు చేస్తాడని కొనియాడారు. మొదటి నుంచి ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పలు విషయాల్లో ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇటీవల ట్రంప్ పై దాడి తరువాత సోషల్ మీడియాలో మస్క్ ట్వీట్ చేశాడు. నేను ట్రంప్ కు పూర్తి మద్దతు ఇస్తున్నాను.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని మస్క్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు క్యాబినెట్ లో చోటిస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలా వీలు చిక్కకుంటే సలహాదారుడిగా నియమించుకుంటానని చెప్పారు. మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసించాడు. ఎలక్ట్రిక్ వాహనాలపై 7500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్ ను రద్దుచేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ట్యాక్స్ క్రెడిట్ లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా మంచి విషయాలు కావని ట్రంప్ అభిప్రాయ పడ్డారు. అయితే, ట్రంప్ ప్రకటన పట్ల ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
Admin
Studio18 News