Studio18 News - జాతీయం / : బెంగళూరులో భార్య వేధింపులు భరించలేక ఇల్లు వదిలివెళ్లిపోయాడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన భర్త.. వారం రోజులైనా ఇంటికి రాకపోవడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి ఆచూకీ కనుగొని మాట్లాడారు. అయితే టెకీ తనను అవసరమైతే జైల్లో పెట్టండి కానీ, ఇంటికి మాత్రం వెళ్లను అని చెప్పడం పోలీసులను విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విపిన్ గుప్తా (34) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరు మాన్యత టెక్ పార్క్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతడికి భార్య శ్రీపర్ణ (42), ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులోని కొడిగేహళ్లిలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, భార్య తరచూ మానసిక వేదనకు గురి చేయడం, వేధింపులకు పాల్పడడం తట్టుకోలేని విపిన్ గుప్తా ఈ నెల ప్రారంభంలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. జాబ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బైక్‌పై వెళ్లిన అతడు.. బ్యాంకు నుంచి రూ. 1.80లక్షలు విత్‌డ్రా చేసుకుని ఎటో వెళ్లిపోయాడు. అతడికి సోలో రైడ్ అలవాటు ఉంది. గతంలో పలుమార్లు ఇలా ఒంటరిగా రైడ్‌కు వెళ్లి రెండుమూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడు. ఆ సమయంలో ఎప్పుడూ ఫోన్‌లో అందుబాటులో ఉండేవాడు. అయితే, ఈసారి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండడం, వారం అయినా జాడలేకపోవడంతో భార్య ఈ నెల 6న కొడిగేహళ్లి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం తన భర్త ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టడంతో పాటు ప్రధానిని ట్యాగ్ చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచి యూపీలోని నోయిడాలో విపిన్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి బుధవారం బెంగళూరుకు రప్పించారు. అనంతరం అతడితో మాట్లాడగా, భార్య పెట్టే మానసిక హింసను భరించలేకపోతున్నానని, ఆమె వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వాపోయాడు. తనపై ఏ కేసు పెట్టుకున్నా పర్వాలేదని, అవసరమైతే జైలుకి పంపించినా వెళ్తా గానీ ఇంటికి మాత్రం వెళ్లబోనని పోలీసులతో తేల్చి చెప్పాడు. విపిన్ ఇంటికి వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు అతడిని సముదాయించే ప్రయత్నం చేశారు.
Admin
Studio18 News