Studio18 News - జాతీయం / : భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగ్గా రాణిస్తోందని, 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... వివిధ కారణాలతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలకు మించిందని, దానిని కొనసాగించేందుకు తీసుకునే చర్యలు ఈ ఏడాది తమ అంచనాలను ప్రభావితం చేస్తాయన్నారు. మరో ముఖ్య అంశం ఏమంటే దేశంలో ప్రైవేటు వ్యయాలు భారీగా పెరిగినట్లు గుర్తించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వ్యయాల వృద్ధి దాదాపు 4 శాతంగా నమోదైనట్లు గీతా గోపీనాథ్ వెల్లడించారు. ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఎఫ్ఎంసీజీ విక్రయాలు బాగా పెరిగాయన్నారు. వర్షాలు కూడా పడ్డాయని, దీంతో పంట ఉత్పత్తి బాగుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7 శాతానికి సవరించామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి 7 శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక సర్వేలో ఇచ్చిన 6.5 శాతం కంటే ఐఎంఎఫ్ ఎక్కువగా అంచనా వేసింది.
Admin
Studio18 News