Studio18 News - జాతీయం / : Military spendings: దేశ భూభాగానికి ఇతర దేశాల నుంచి ముప్పు ఎల్లప్పుడూ ఉంటుంది. మా జోలికి వస్తే అంతుచూస్తామన్న భయాన్ని శత్రు దేశాల్లో ఉంచితేనే మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం. అందుకు తగ్గట్లుగా ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందడం వెనుక ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వీరోచిత గాథలు ఉన్నాయి. అంతగా కష్టపడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకునే సత్తా లేకపోతే మళ్లీ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులే వస్తాయి. ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు చైనా వీలు చిక్కితే దాడి చేయాలని చూస్తుంటాయి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే రెప్పపాటులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. భారత్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ మన దేశ సైన్యం త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిందే. రక్షణ రంగానికి భారత్ బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంటూ వస్తోంది. రక్షణ రంగానికి భారత్ రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో రూ.5.25 లక్షల కోట్లు కేటాయించగా, గత ఏడాది (2023-24) రూ.5.94 లక్షల కోట్లు కేటాయించింది. రక్షణ రంగంలోనూ మేడిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తూనే, ఫైటర్ జెట్లు, జలాంతర్గాములతో పాటు యుద్ధ ట్యాంకులు కొనుగోలుకు భారత్ అధికంగా కేటాయింపులు చేసింది. భారత్ అధునాతన ఆయుధ వ్యవస్థల అభివృద్ధి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సైనిక వ్యయాల్లో అగ్రరాజ్యాలకు ఏ మాత్రం తీసుపోని విధంగా భారత్ కేటాయింపులు చేస్తోంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణకు రూ.6,21,940 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. 2022లో సైనిక వ్యయంలో టాప్-10 దేశాలు * అమెరికా: రూ.73 లక్షల కోట్లు * చైనా: రూ.25 లక్షల కోట్లు * రష్యా: రూ.7.5 లక్షల కోట్లు * భారత్: రూ.6.8 లక్షల కోట్లు * సౌదీ అరేబియా: రూ.6.2 లక్షల కోట్లు * యూకే: రూ.5.8 లక్షల కోట్లు * జర్మనీ: 4.7 లక్షల కోట్లు * ఫ్రాన్స్: రూ.4.5 లక్షల కోట్లు * జపాన్: రూ.3.9 లక్షల కోట్లు * దక్షిణ కొరియా: రూ.3.9 లక్షల కోట్లు
Admin
Studio18 News