Studio18 News - క్రీడలు / : టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆరంభంలో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో తొలుత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఆ వెంటనే జరిగిన వన్డే సిరీస్‌ను మాత్రం 2-0 తేడాతో భారత్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు చెలరేగడంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు జట్టులో ఉన్నప్పటికీ భారత్ వరుసగా రెండు వన్డేలలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక మరో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో గౌతమ్ గంభీర్‌కు ఆరంభంలో మిశ్రమ ఫలితం ఎదురైంది. కాగా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం ఆరంభంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. ప్రధాన కోచ్‌గా అద్భుతంగా రాణించిన రాహుల్ ద్రావిడ్ స్థానంలో గంభీర్ బాధ్యతలు స్వీకరించాడని, టీ20 ప్రపంచ ఛాంపియన్లు అయిన భారత ఆటగాళ్లు గంభీర్ నేతృత్వంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారని ఉతప్ప విశ్వాసం వ్యక్తం చేశాడు. గంభీర్ ఎల్లప్పుడూ ఒత్తిడిలో మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుంటాడని, పెద్ద టోర్నీలు అంటే చెలరేగిపోతుంటాడని వివరించారు. ఇప్పుడు కోచ్ గానూ గంభీర్‌లో తాను ఈ లక్షణాలనే గుర్తించానని ఉతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గంభీర్ మంచి అవకాశాల కోసం వెతుకుతాడని, వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడని ఊతప్ప చెప్పాడు. ఒక నాయకుడిగా ఆటగాళ్లు మెరుగుపడే వాతావరణాన్ని కల్పించడానికి గంభీర్ కృషి చేస్తాడని ఊతప్ప పేర్కొన్నాడు. గంభీర్ సామర్థ్యంపై ఎలాంటి అనుమానం లేదని, ఈ విషయంలో తాను భరోసా ఇవ్వగలనని పేర్కొన్నాడు. గంభీర్ ఒక అద్భుతమైన వ్యూహకర్త, ఆటగాళ్ల మధ్య అసాధారణమైన నాయకుడు అతడని ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రతిభ చాటేవారిని ప్రోత్సహించే సంస్కృతిని టీమ్‌లో గంభీర్ పెంపొందిస్తాడని, ఆటగాళ్లకు భద్రతను అందించే నాయకుడని ఊతప్ప మెచ్చుకున్నాడు. కాగా గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 మధ్య 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
Admin
Studio18 News