Studio18 News - క్రీడలు / : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ 2024 దులీప్ ట్రోఫీలో ఆడబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. దులీప్ ట్రోఫీ టోర్నీసెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. టోర్నీలో ఒక రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, దులీప్ ట్రోఫీ ఏపీలోని అనంతపురంలో జరగాల్సి ఉంది. అయితే అనంతపురానికి ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల స్టార్ క్రికెటర్లు రావడం అనుమానంగా మారింది. దీంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక రౌండ్ దులీప్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ దశలోనే రోహిత్, విరాట్ పాల్గొననున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోహిత్ శర్మ దాదాపు 9 ఏళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో రీ ఎంట్రీ ఇస్తాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ను దులీప్ ట్రోఫీలో ఆడాలని కోరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే 2023 వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో అతడిని కూడా ఈ టోర్నీలో బరిలోకి దింపాలని బోర్డు భావిస్తోంది. కానీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్యానెల్ టోర్నమెంట్ కోసం నాలుగు స్క్వాడ్‌లు- ఇండియా ఏ, ఇండియా బీ, ఇండియా సీ, ఇండియా డీలను ఎంపిక చేయనుంది. పాత జోనల్ ఫార్మాట్ ప్రకారం అయితే... సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మొత్తం 5 జోన్స్ వారీగా టోర్నీ జరిగేది. ఆయా జోన్లకు సంబంధించిన క్రికెటర్లు తమతమ జోన్ల తరఫున బరిలో దిగేవారు. ఇక ఈసారి ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. అయితే బంగ్లాతో టీమిండియా టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. అంటే రోహిత్, విరాట్సహా స్టార్ ప్లేయర్లు దులీప్ ట్రోఫీ టోర్నీ ఆసాంతం ఆడకపోవచ్చు. అలాగే చెన్నైలో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బోర్డు స్వల్పకాలిక క్యాంప్‌ను కూడా ప్లాన్ చేస్తోంది.
Admin
Studio18 News