Studio18 News - క్రీడలు / : భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అంజలి వివాహమై దాదాపు 30 ఏళ్లు అవుతున్నాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు అర్జున్ టెండూల్కర్, కూతురు సారా టెండూల్కర్. ఇక సచిన్ తన కంటే వయసులో పెద్ద అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సచిన్ గురించి ఆయన అత్త అన్నాబెల్లె మెహతా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. 'మై పాసేజ్ టు ఇండియా' అనే కొత్త పుస్తకంలో ఆమె ఈ విషయాలను ప్రస్తావించారు. కూతురు అంజలి తాను ఓ కుర్రాడిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. దాంతో అతడిని చూడాలనుకున్నారట అన్నాబెల్లె మెహతా. వెంటనే ఇంటికి రావాల్సిందిగా సచిన్‌కు కబురు పెట్టారు. అలా సచిన్ ఆమెను కలవడానికి వచ్చిన రోజునాటి ఘటనను అన్నాబెల్లె పుస్తకంలో రాశారు. "భారత క్రికెట్‌లో సచిన్ అత్యంత ప్రభావవంతమైన స్టార్ క్రికెటర్ అని నేను అప్పటికి గుర్తించాను. కానీ అతను తన తోటి క్రికెటర్లలో చాలా మందిలానే ప్లేబాయ్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన చెందాను. తొంభైలలో సచిన్ ఇంగ్లాండ్‌లో డేవిడ్ బెక్‌హామ్ లాగా ఉండేవాడు. అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుసుకుని అతడిని చూడాలనుకున్నా. ఆరడుగులు ఉంటాడని, అందంగా ఉంటాడని ఊహించుకున్నా. తీరా చూస్తే పొట్టిగా ఉన్నాడు. చిన్నపిల్లాడిలా కనిపించాడు. 19 సంవత్సరాల వయస్సులో అతను పిల్లోడిలానే కనిపించాడు. అంజలి హీల్స్ వేసుకుంటే ఆమె ఎత్తు కూడా ఉండడు. ఐదున్నర అడుగుల ఎత్తు ఉండే సచిన్‌కు అతని జుట్టు మరో అంగుళం ఎత్తును ఇచ్చింది. అయితే, ఆ సమయంలో అతను చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్య పరిచింది. 'మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం' అని సూటిగా చెప్పాడు. తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి 1995 వరకు (అతనికి 22 ఏళ్లు వచ్చేవరకు) వేచి చూశాడు" అని అన్నాబెల్లే తన పుస్తకంలో రాసుకొచ్చారు. అంజలి కుటుంబం 1950 ప్రాంతంలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడింది.
Admin
Studio18 News