Studio18 News - జాతీయం / : బీజేపీ పాలనలో కర్ణాటకలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నామని ఆ రాష్ట్ర ఐటీబీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లు జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. బీజేపీ, జేడీఎస్ నేతలు సగం మంది జైలులో, మిగతా సగం మంది బెయిలుపై ఉంటారని అన్నారు. ఈమేరకు ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. వాటిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని వివరించారు. ప్రస్తుతం పలు కేసుల్లో విచారణ అధికారులు మధ్యంతర నివేదికలు సమర్పించారని చెప్పారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా అస్థిర పరిచేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తమ పార్టీ నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన గవర్నర్.. మాజీ మంత్రి మురుగేశ్ నిరాణిపై ఫిర్యాదు చేస్తే మాత్రం సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. గవర్నర్‌కు ఎక్కడి నుంచో సూచనలు అందుతున్నాయని, వాటి ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే గవర్నర్లను కోర్టులు మందలించే స్థితి ఏర్పడిందని మంత్రి చెప్పారు.
Admin
Studio18 News