Studio18 News - జాతీయం / : Sikkim Mandates Garbage Bags : ప్రపంచంలో చూడాల్సిన ప్రాంతాలు ఎన్నో. వాటిల్లో తప్పక చూసితీరాల్సినవి కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో సిక్కిం రాష్ట్రం ఒకటి. నేషనల్ జియోగ్రఫిక్ సంస్థ 2024లో సందర్శించదగ్గ చల్లని ప్రదేశాల్లో ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో సిక్కిం చోటు దక్కించుకొని ఏకైక భారతీయ రాష్ట్రంగా నిలిచింది. సిక్కింలో ఒకవైపు తెల్లని దుప్పటి కప్పుకున్నట్లున్న హిమగిరులు, వాటి నుంచి జాలువారే జలపాతాలు, మరోవైపు స్వచ్ఛమైన సరస్సులతో ప్రకృతి అందాలకు సిక్కిం నిలయంగా మారింది. సిక్కింలో పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కింకు వచ్చే పర్యాటకులు ఆ నిబంధన తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.సిక్కిం రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని పర్యాటక వాహనాలకు పెద్ద చెత్త బ్యాగులను సిక్కిం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. సిక్కింలోకి ప్రవేశించే అన్ని పర్యాటక వాహనాలు ఇకనుంచి తప్పనిసరిగా పెద్ద చెత్త సంచిని వెంట తీసుకెళ్లాలి. వ్యర్థాలను ఆ సంచుల్లోనే పడేయాలి. చెత్త సంచులను వినియోగం గురించి ప్రయాణీకులకు తెలియజేయడం టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, వాహన డ్రైవర్ల బాధ్యత అని ప్రభుత్వం పేర్కొంది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, తనిఖీల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాహనదారులకు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.పర్యావరణ సుస్థిరత లక్ష్య సాధనలో ప్రతిఒక్కరిని భాగస్వాములను చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక, పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు చెత్త బ్యాగుల విషయంపై పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత దేశంలో అత్యల్పంగా ఆరు లక్షల మంది నివాసితులతో కలిగిన రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దీంతో ప్రతీయేటా ఈ రాష్ట్రంకు 20లక్షల మందికిపైగా పర్యాటకులు వస్తుంటారు.
Admin
Studio18 News