Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. షేక్ హసీనాను అరెస్ట్ చేసి ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేయాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో మరణాలకు షేక్ హసీనా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కాగా భారత్‌తో సానుకూల సంబంధాలను కొనసాగించడం తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చెప్పారు. దేశంలో అనేక మరణాలకు షేక్ హసీనా కారణమని, చాలా మందిని బలిగొన్నారని అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించవద్దని అన్నారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ఎపీ) అనుకూల న్యాయవాదులు పాల్గొన్నారు. షేక్ హసీనాను అప్పగించాలన్న ఖోకాన్ బీఎన్‌పీ పార్టీకి జాయింట్ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేస్తున్నారు.
Admin
Studio18 News