Studio18 News - జాతీయం / : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిన్న హింసాత్మక పరిణామాలు తార స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ తరలి వచ్చి ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ లో రాజకీయ ఆశ్రయంపై అనుమతి వచ్చాక ఆమె లండన్ వెళతారని తెలుస్తోంది. అప్పటివరకు భారత్ లోనే ఆశ్రయం పొందనున్నారు. ఈ నేపథ్యంలో, షేక్ హసీనా ఉంటున్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద భద్రతను మరింత పెంచారు. వాయుసేన స్థావరం ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడ ఎవరూ గుమికూడకుండా, వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాయుసేన స్థావరం పరిసరాల్లోనూ భారీగా బలగాలను మోహరించారు. నిన్న సాయంత్రం ఢాకా నుంచి ప్రత్యేక సైనిక విమానంలో షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. బంగ్లాదేశ్ సైనిక విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించగానే, భారత వాయుసేనకు చెందిన రెండు రాఫెల్ జెట్ ఫైటర్లు ఆ విమానానికి ఎస్కార్ట్ గా వ్యవహరించాయి. హిండన్ ఎయిర్ బేస్ వద్ద షేక్ హసీనాకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అక్కడ్నించి ఆమెను సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.
Admin
Studio18 News