Studio18 News - జాతీయం / : రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌లో సంక్షోభం సృష్టించింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా నిన్న (సోమవారం) రాజీనామా చేశారు. భద్రత కోసం ఆమె హుటాహుటిన భారత్‌కు వచ్చారు. పొరుగు దేశంలో అకస్మాత్తుగా ఏర్పడిన ఈ సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందంటూ అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పాల్గొంటారని తెలిసింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితిని విదేశాంగమంత్రి జైశంకర్ సోమవారం రాత్రే ప్రధాని మోదీకి వివరించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను మోదీ కలుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.
Admin
Studio18 News