Studio18 News - అంతర్జాతీయం / : పొరుగు దేశం బంగ్లాదేశ్ నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఏకంగా దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సైనిక పాలన రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని హసీనా తనయుడు సజీబ్ వాజెద్ జాయ్ దేశ ఆర్మీని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆమె పాలనను వేరే వాళ్లు స్వాధీనం చేసుకోకుండా నిరోధించాలని దేశ భద్రతా దళాలను ఆయన కోరారు. "మీ కర్తవ్యం దేశ ప్రజలను, మన దేశాన్ని సురక్షితంగా ఉంచడం. రాజ్యాంగాన్ని కాపాడడం" అని అమెరికాలో ఉండే సజీబ్ వాజెద్ జాయ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఒక్క నిమిషం కూడా ఎన్నికకాని ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వవద్దు, అది మీ కర్తవ్యం" అని అన్నారు. హసీనాకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సలహాదారుగా ఉన్న జాయ్.. ఆమెను బలవంతంగా బయటకు పంపితే బంగ్లాదేశ్ సాధించిన పురోగతికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దేశ అభివృద్ధి, పురోగతి అంతా మాయమైపోతుందన్నారు. తిరిగి అక్కడికి చేరుకోలేమన్నారు. "నాకు అది వద్దు.. మీరు కూడా అది కోరుకోరని నాకు తెలుసంటూ" సజీబ్ వాజెద్ జాయ్ చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నందున అతనిని హెచ్చరిస్తూ జాయ్.. సైనిక ప్రతినిధి తదుపరి వివరాలు ఇవ్వకుండా ఏఎఫ్‌పీకి చెప్పారు. దీంతో మరోసారి దేశంలో సైనిక పాలన రావొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, జనవరి 2007లో దేశంలో రాజకీయ అశాంతి నేపథ్యంలో సైన్యం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెండేళ్లపాటు తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది.
Admin
Studio18 News