హిందువా, ముస్లిమా అనేది నాకు ముఖ్యం కాదు: నిఖత్ జరీన్

Spread the love

తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఘనంగా సత్కరించి, రూ. 2 కోట్ల నజరానా ఇచ్చారు. మరోవైపు మతాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని… తాను పుట్టిన మతం తరపున ప్రాతినిధ్యం వహించడం లేదని జరీన్ చెప్పింది. తాను ఒక క్రీడాకారిణి అని… హిందువా, ముస్లిమా అనే విషయం తనకు అనవసరమని తెలిపింది. తన మాతృదేశానికి మెడల్ తీసుకొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. తెలంగాణలోని ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన 25 ఏళ్ల జరీన్… సమాజంలోని ఎన్నో ఆంక్షలను, అడ్డంకులను అధిగమించి బాక్సింగ్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. 

మన బాక్సర్లు ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదని జరీన్ తెలిపింది. బాక్సర్లకు కావాల్సిన శక్తి, వేగం, పవర్ అన్నీ మన వాళ్లకు ఉన్నాయని చెప్పింది. రెగ్యులర్ ఈవెంట్లలో మన వాళ్లు బాగా పర్ఫామ్ చేస్తారని… అయితే పై స్థాయికి వెళ్లే సరికి తీవ్ర ఒత్తిడికి గురవుతారని తెలిపింది. ఒత్తిడిలో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారని చెప్పింది. మానసిక ఒత్తిడిని సరిగా హ్యాండిల్ చేయడం వల్లే తాను గెలుపొందానని తెలిపింది. మన బాక్సర్లకు మానసిక ఒత్తిడిని జయించేందుకు తగిన శిక్షణ ఇప్పించాలని సూచించింది.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com