కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. నేనూ అక్కడి నుంచే: తీన్మార్ మల్లన్న

Spread the love
  • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్న మల్లన్న
  • మున్ముందు మల్లన్న బృందం రాజకీయ పార్టీగా అవతరిస్తుందని స్పష్టీకరణ
  • పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో తాత్కాలికంగా బ్రేక్
Will Also Contest From Where KCR Contest Says Teenmaar Mallanna
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సత్తుపల్లిలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండుమూడు రోజుల్లోనే ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న సమాచారం తనవద్ద ఉందన్నారు. రానున్న రోజుల్లో మల్లన్న బృందం రాజకీయ  పార్టీగా మారుతుందన్నారు.

ప్రజల పక్షాన పోరాడే తమను ప్రజల్లో తిరగనీయకుండా పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని, తమ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే కోర్టుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. పాదయాత్రలో తన ప్రసంగాల ద్వారా గొత్తికోయలు మావోయిస్టుల్లో చేరుతారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని, తన ప్రసంగాలతో ఇప్పటి వరకు ఎంతమంది అలా చేరారో చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు.

కాగా, తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘7200 ఉద్యమ పాదయాత్ర’కు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అనుమతి నిరాకరించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రలో భాగంగా నిన్న సత్తుపల్లిలోని జీవీఆర్, కిష్టారం ఓసీల్లో మల్లన్న పర్యటించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com