మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల్లో పాల్గొన్న అధికారి రత్నాకర్ కు హైకోర్టులో ఊరట

Spread the love
  • ఇటీవల మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు
  • దాడుల్లో పాల్గొన్న రత్నాకర్ అనే అధికారిపై ఫిర్యాదు
  • మల్లారెడ్డి చిన్నకుమారుడి ఫిర్యాదు ఆధారంగా దోపిడీ కేసు
  • హైకోర్టును ఆశ్రయించిన రత్నాకర్
  • విచారణపై స్టే ఇచ్చిన న్యాయస్థానం
High Court gives stay on probe against IT official Ratnakar
ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబీకులు, ఐటీ అధికారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఐటీ అధికారి రత్నాకర్ పై మంత్రి మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, రత్నాకర్ ల్యాప్ టాప్ చోరీకి గురైందని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఐటీ దాడులు విశ్వసనీయంగా అనిపించడంలేదని, నకిలీ దాడుల్లా ఉన్నాయని, సోదాలపై తన సోదరుడు మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకాలు చేయించుకునేందుకు ప్రయత్నించారంటూ భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్ పై ఐపీసీ 384 కింద దోపిడీ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ ను మంత్రి మల్లారెడ్డి చేయిపట్టుకుని పోలీసుల వద్దకు తీసుకొచ్చారు.

కాగా, తనపై కేసును రత్నాకర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు స్పందించింది. రత్నాకర్ ను 4 వారాల పాటు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన మీద నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.

అటు, ఐటీ అధికారుల ల్యాప్ టాప్ వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది. ఐటీ అధికారి రత్నకుమార్ కు చెందిన ల్యాప్ టాప్ దొంగతనానికి గురైందని, అందులో ఉన్న కీలక సమాచారాన్ని తొలగించారని ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా, మంత్రి మల్లారెడ్డి అనుచరులు ల్యాప్ టాప్ ను పోలీసులకు అప్పగించారు.

అయితే ఆ ల్యాప్ టాప్ ను తీసుకెళ్లేందుకు ఐటీ అధికారులు ఎవరూ రాలేదు. ఇప్పుడా ల్యాప్ టాప్ బోయిన్ పల్లి పోలీసుల వద్ద ఉంది. కాగా, ఆ ల్యాప్ టాప్ లో ఎంతో విలువైన సమాచారం ఉందంటూ ఐటీ అధికారులు తమ ఉన్నతాధికారులకు నివేదించారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com