14/05/2021

ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగిందో చెప్పాలి: మంత్రి కొప్పుల

  • మంత్రివర్గం నుంచి ఈటల తొలగింపు
  • పార్టీలో తనకు గౌరవంలేదన్న ఈటల
  • మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్
  • కేసీఆర్ అనేక విధాలుగా గౌరవించారన్న కొప్పుల
  • కానీ కేసీఆర్ పైనే ఈటల ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం

భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి తొలగింపు నేపథ్యంలో పార్టీలో తనకు గౌరవం లేదని, తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని, ఈటలకు శాసనసభాపక్ష నేతగానూ అవకాశం ఇచ్చి పార్టీలో మంచి గుర్తింపునిచ్చారని వివరించారు. ఈటల తమ కళ్లముందే ఉన్నతస్థానానికి ఎదిగారని పేర్కొన్నారు.

ఆర్థిక, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఎంత కీలకమైనవో అందరికీ తెలిసిందేనని, అలాంటి శాఖలను ఈటలకు అప్పగించారని తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘంలోనూ ఈటలకు ప్రాముఖ్యత ఇచ్చారని, కానీ ఈటల తరచుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారని కొప్పుల ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లోనూ ఈటలను పార్టీ ఏమీ అనలేదని, ఇక ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగిందో చెప్పాలని నిలదీశారు.

పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనడం, అమ్మడం నేరం అని ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కొనడం తప్పుగా అనిపించలేదా అని నిలదీశారు. రూ.1.5 కోట్ల విలువైన భూములను కేవలం రూ.6 లక్షలకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఇది ఎస్సీలకు నష్టం చేకూర్చినట్టు కాదా? అని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు జరిగిన అన్యాయంపై రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే… సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎంపైనే ఎదురుదాడికి దిగడం ఈటలకు మాత్రమే చెల్లిందని అన్నారు. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు చేయరాదని చట్టం చెబుతోందని, అసైన్డ్ భూములను ఎన్నిసార్లు అమ్మినా తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని కొప్పుల స్పష్టం చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: