08/05/2021

జగన్ సీఎం అయిన తర్వాత కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు: కొల్లు రవీంద్ర

  • ఫ్యాక్షన్ స్వభావం ఉన్న వ్యక్తి సీఎం అయితే పాలన ఇలాగే ఉంటుంది
  • తిరుపతిలాంటి ఊరిలో ఎవరుంటారని జగన్ గతంలో అనలేదా?
  • వివేకా హత్య కేసులో నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్యాక్షన్ స్వభావం ఉన్న వ్యక్తి సీఎం అయితే పాలన ఇలాగే ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ, తప్పుడు కేసుల్లో ఇరికించడం రాజకీయాల్లో ఎప్పుడూ జరగలేని… జగన్ సీఎం అయిన తర్వాత కొత్త సంస్కృతిని తీసుకొచ్చారని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని జగన్ పూర్తిగా గాలికొదిలేశారని… విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ, రాష్ట్రంలో అరాచక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు.

తిరుపతిలాంటి ఊరిలో ఎవరుంటారని జగన్ గతంలో అనలేదా? అని రవీంద్ర ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఎలా గెలిచిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేత దేవినేని ఉమ చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. విచారణల పేరుతో ఉమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. బీసీ నేత అచ్చెన్నాయుడిని అక్రమ కేసులతో జైలుకు పంపారని మండిపడ్డారు. ఉమను ఇబ్బంది పెట్టడంపై పెట్టిన దృష్టిని వైయస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుపై పెట్టడం లేదని అన్నారు. వివేకాను హత్య చేసిన నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని విమర్శించారు.

అన్ని రోజులు ఓకేలా ఉండవనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని రవీంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. టీడీపీ నేతలను వేధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: