14/05/2021

ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది.. కరోనా భారీగా విస్తరించే అవకాశం ఉంది: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశ వ్యాప్తంగా చాలా తీవ్రంగా ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒకే రోజు  రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోందని చెప్పారు. రాననున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కరోనా దెబ్బకు అగ్ర దేశాలు కూడా అల్లాడుతున్నాయని. వాటితో పోల్చితే తక్కువ వసతులు ఉన్న మనం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలి నుంచి విస్తరించే స్థాయికి వైరస్ చేరుకుందని హెచ్చరించారు.

తొలి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని, ఇదే సమయంలో మహమ్మారి మరింత బలాన్ని పుంజుకుందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వైరస్ మ్యుటేషన్లుగా, డబుల్ మ్యుటేషన్లుగా ఏర్పడి వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. అయితే ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో బెడ్లు, ఔషధాలు, ఆక్సిజన్ కు కొరత లేదని తెలిపారు. 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు.

గతంలో కరోనా సోకిన వ్యక్తిని ఇంట్లో ఐసొలేట్ చేస్తే సరిపోయేదని. ఇప్పుడు ఇంట్లో రోగిని గుర్తించేలోగానే కుటుంబమంతా వైరస్ కు గురవుతోందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. 15 రోజుల్లోనే పాజిటివిటీ రేటు డబుల్ అయిందని తెలిపారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: