14/05/2021

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు… సీఐడీ విచారణకు ఆదేశిస్తా: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ లో నేడు ఐదో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 4.13 గంటల సమయానికి 69.40 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల కూచ్ బెహార్ లో పోలింగ్ సందర్భంగా సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆ మృతదేహాలతో ర్యాలీ చేయాలని తన నేతలకు మమతా సూచించినట్టు ఓ ఆడియో టేప్ కలకలం రేపింది. ఈ నేపథ్యలోనే మమతా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు.

“వాళ్లు (బీజేపీ నేతలు) మన రోజువారీ సంభాషణలను కూడా రహస్యంగా వింటున్నారు. వారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్టు అర్థమవుతోంది. దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తా. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలిసింది” అని వెల్లడించారు.

అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి విషయంలో ఏమాత్రం సరితూగలేని కాషాయ దళం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మమతా విమర్శించారు. కేంద్ర బలగాలు కొందరు ఏజెంట్ల సాయంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్న సమాచారం తన వద్ద ఉందని వెల్లడించారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేదని బీజేపీ చెబుతున్నప్పటికీ, ఈ కుట్రకు వారే బాధ్యులని స్పష్టమైందని అన్నారు.

కాగా, మమతా మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను అధికార టీఎంసీ బోగస్ అని కొట్టిపారేసింది. అలాంటి సంభాషణే జరగలేదని స్పష్టం చేసింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: