14/05/2021

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఊపందుకున్న పోలింగ్… కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేసిన నోముల భగత్

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 31 శాతం పోలింగ్ జరగ్గా, మధ్యాహ్నం 1 గంట వేళకు కాస్త పుంజుకుని 53.3 శాతంగా నమోదైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్నారు. కాగా, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇబ్రహీంపేటలోని ఓ పాఠశాలలో ఓటేశారు. ఈ సందర్భంగా ఆయన తన విజయంపై ఎలాంటి సందేహాల్లేవన్నారు.

ఇక సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గ ఘటనలేవీ జరగలేదు. నాగార్జునసాగర్ జూనియర్ కాలేజీలో ఏజెంట్ రాకపోవడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోగా, స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో పోలింగ్ షురూ అయింది. కరోనా నేపథ్యంలో కచ్చితంగా మాస్కు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: