14/05/2021

ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వివేక్ కన్నుమూత.. శోకసంద్రంలో కోలీవుడ్

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు వివేక్ ఈ తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. గురువారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ నిన్న ఉదయం శ్వాస ఆడడం లేదని చెబుతూనే తన ఇంట్లో కిందపడి స్పృహ కోల్పోయారు.

దీంతో ఆయనను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. వివేక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, ఆరేళ్ల క్రితం డెంగీ జ్వరంతో ఓ కుమారుడు మృతి చెందాడు.

తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితమైన వివేక్ టీవీ హోస్ట్‌గా అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్ వంటి వారిని ఇంటర్వ్యూలు చేసి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే వివేక్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా దక్కింది. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ రక్షణకు మద్దతుగా వివేక్ పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాట అగ్రహీరోలైన రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విక్రమ్, విజయ్, అజిత్, ధనుష్ తదితర హీరోలతో కలిసి ఆయన నటించారు. వివేక్ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

గురువారం చెన్నైలోని ఓమాండురార్‌ ఆసుపత్రిలో వివేక్‌ కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అంతలోనే ఆయన మృతి చెందారన్న వార్త అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసింది.

 

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: